పొడ అంటే చాలా విస్తృతమైన అర్థం ఉంది. ముందుగా నిఘంటు అర్థమే తీసుకుంటే…

పొడ : బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1903


  • 1. Appearance, figure, shape. రూపు, చూపు.
  • 2. A mole, speck, mark, a scruff or eruption on the skin.
  • 3. Variegated colour - పొడలపురుగు a spotted worm or serpent

ఏమనిషినైనా , జంతువునైనా, వస్తువునైనా గుర్తించడానికి కొన్ని గుర్తులు , రూపాలు , ఆకారాలు , వాసనలు, శబ్ధాలు ఉంటాయి. ఉదా: ఒక తాడుని అలా ఇలా వంచి పడేస్తే పాముగా కూడా భ్రమిస్తాము. ఎందుకంటే అలా వంపులు తిరిగి కనబడడం అనేది పాము యొక్క మొదటి గుర్తు. ఇది రూపం మీద ఆధారపడ్డ పొడ.

కొన్ని కొన్ని జంతువులను , వస్తువులను వాటి Outline ద్వారా మనం గుర్తించగలము. ఇది కూడా రూపం మీద ఆధారపడ్డ పొడ.

కొంతమంది వ్యక్తులను గుర్తించడానికి బండగుర్తు లాంటిది ఏదో ఉంటుంది. పుట్టుమచ్చో, ఉలిపిరికాయో, కాలిన మచ్చో , గాయపు మచ్చో , కత్తిగాటో, ఇలాంటివి అన్నమాట. వారు మారువేషంలో ఉన్నా కూడా గుర్తించగలము. ఇది వారి పొడ.

ఇవేమీ లేకపోయినా వారి నడకో, మాటతీరో , ప్రవర్తనో, వాసనో వారిని పట్టిచ్చేస్తుంది. ఇది వారి పొడ.

కొన్ని కొన్ని వస్తువులను చూస్తే వాటికి సంబంధించిన వ్యక్తులు జ్ఞప్తికి వస్తారు. ఇది వారి పొడ.

ఏం విన్నా, ఏం చూసినా, ఏం ముట్టుకున్నా , ఏం వాసన చూసినా ఆయా వ్యక్తులు గుర్తొస్తారో అది వారి పొడ.

అందుకే శత్రువులని ఉద్ధేశించి "వాడి పొడ గిట్టదు" అని అంటూ ఉంటారు. అంటే శత్రువే కాదు , వాడికి సంబంధించిన ఏ వ్యక్తిని, గుర్తుని, వస్తువుని చూసినా ఉద్రేకం వచ్చేస్తుంది.

పొడ అంటే చూపు అని కూడా అర్థం ఉంది. కొంతమంది కరుణామయ చూపులు మనల్ని తడిపి ముద్ద చేస్తాయి. కొంతమంది చూపులు మనల్ని వణికిస్తాయి. ఇది వారి పొడ.

అలాగే ఎండ పొడ పడదు అని అంటూ ఉంటారు. అంటే ఒక పెద్దచెట్టు కింద పడే నీడలో సూర్యకిరణాలు కొమ్మల, ఆకుల సందుల్లోంచి లేలేతగా పడుతూ ఉంటాయి. నీరెండగా వెచ్చగా ఉంటుంది. కొంతమందికి ఆ ఎండ పొడ కూడా పడదు అని అర్థం.

ఒకరకంగా చెప్పాలంటే పొడ అంటే ఇంగ్లీషులో ఆరా (aura) అని అనుకోవచ్చు.

అన్నమయ్య అటువంటి పొడ నేదో చూసి వెంకటేశ్వరస్వామిని దర్శించాడు లేదా కనుగొన్నాడు.

పురుషోత్తమా పురుషోత్తమా

పురుషోత్తమా పురుషోత్తమా

పొడగంటిమయ్య మిమ్ము పురుషోత్తమా

పొడగంటిమయ్య మిమ్ము పురుషోత్తమా

మమ్ము ఎడయకవయ్య కోనేటి రాయడా

పొడగంటిమయ్య మిమ్ము పురుషోత్తమా

మమ్ము ఎడయకవయ్య కోనేటి రాయడా