Ad Code

Responsive Advertisement

రైలుబండిలో బోగీ - కోచ్ - కంపార్టుమెంట్ ఈ మూడింటికీ తేడా తెలుసా మీకు?

 

రైలుబండికి సంబంధించి బోగీ - కోచ్ - కంపార్టుమెంట్ ఈ మూడు పదాలను ఒకదానికొకటి పర్యాయపదాలుగా వాడేస్తుంటాము. ఈ మూడూ కూడా ఇంగ్లీషు పదాలే. కాని, 'బోగీ'ను తెలుగు పదంగా భావించి వారి అచ్చతెనుగు సంభాషణలలోనూ, వ్యాసాలలోనూ చాలామంది వాడడం చూశాను.

బోగీ (bogie) అనేది ఆంగ్ల పదం. Bogie అని Google లో టైపు చేసి బొమ్మలు చూడండి. మీకు కనిపించే బొమ్మలు ఈ విధంగా వుంటాయి. అవునండీ, ఇదే బోగీ అంటే!

మొదటి సారి చూసినపుడు నేనూ నమ్మలేదు. వెంటనే Oxford డిక్షనరీలో చూశాను. నమ్మక తప్పలేదు. ఒరిజినల్ ఇంగ్లీషు పదానికి మనవాళ్ళు మరొక అర్థాన్ని సృష్టించి వాడుతున్నట్లుగా తెలిసింది.

నాలుగు చక్రాలు, రెండు ఇరుసులు కలిగిన ఈ యూనిట్ ఒక బోగీ. అయితే, మరి coach అంటే ఏమిటి? ఇదిగో ఇది కోచ్ అంటే ...

బొమ్మలో తాత్కాలికంగా తగిలించిన చక్రాలు ఉన్నాయి. క్రింది బొమ్మలో చూపినట్లు. వాటి స్థానంలో ఇంతకు ముందు చూపిన రెండు బోగీలను తగిలించి కోచ్ ను వాడకంలోకి తీసుకువస్తారు

ఈ విధంగా ప్రతి కోచ్ కు ఆ చివర ఒకటి ఈ చివర ఒకటి రెండు బోగీలు ఉంటాయి.

బోగీలు, కోచ్ ల గురించి, వాటి మధ్య తేడాలు అర్థమయ్యాయనుకుంటున్నాను. ఇక కంపార్ట్మెంట్ విషయానికి వద్దాం. కంపార్ట్మెంట్ అంటే, విభాగము అని అర్థం. మొత్తం ట్రైన్ లో ఒక్కొక్క coach ఒక్కొక్క విభాగం అనే అర్థంలో కోచ్ నే కంపార్ట్మెంట్ అని అంటూ వుంటాం.

మన దేశంలో కోచ్ ఫ్యాక్టరీలు ఉన్నాయి కాని, కంపార్ట్మెంట్ ఫ్యాక్టరీలు లేవు. కాబట్టి coachను కంపార్ట్మెంట్ అనడం రైల్వే వారి పరిభాష కాదు. ఒక్కొక్క కోచ్ లోనూ క్రింద చూపినలాంటి విభాగాలు 9 వరకూ ఉంటాయి. వాటినొక్కక్క దానిని ఒక్కొక్క కంపార్ట్మెంట్ గా పరిగణిస్తారు.

ఈ క్రింది బొమ్మలో మనకు మూడు కంపార్ట్మెంట్లు కనిపిస్తున్నాయి.

ఇవి కాకుండా ఇంకా కేబిన్ (Cabin), కూపే (Coupe) అనేవి I A/C కోచ్ లలో కనిపిస్తాయి. కేబిన్ లో నాలుగు బెర్త్ లు, కూపే లో రెండు బెర్త్ లు మాత్రమే వుంటాయి.

మీరు ఎప్పుడు టికెట్ రిజర్వు చేసుకున్నా టికెట్ పై Coach నెంబర్ అని మాత్రమే ఉంటుంది కాని, బోగీ అనో, కంపార్ట్మెంట్ అనో వుండదు. కాబట్టి ఇకపై ప్రయాణం చేసేడప్పుడు టికెట్ పై చూపిన కోచ్ లోకి ఎక్కి, మీ బెర్త్ నెంబర్ యే కంపార్ట్మెంట్ లో ఉందో చూసుకొని అక్కడే కూర్చోండి. మీకు రిజర్వేషన్ ఉన్నా లేకున్నా సరే ఏ 'బోగీ'లోకీ దూరే ప్రయత్నం చెయ్యకండి. అది చాలా ప్రమాదకరం.

P.S.:

Oxford డిక్షనరీలో Bogie కు ఇచ్చిన అర్థం ఇది:

  1. BRITISH: an undercarriage with four or six wheels pivoted beneath the end of a railway vehicle.
  2. INDIAN: a railway carriage. "almost all long-distance trains have seventeen to twenty bogies"

ఇంగ్లీషును ఎవరు ఏయే విధాలుగా వాడుకున్నా సరే Oxford డిక్షనరీలో ఆ వాడకాలకు చోటు కల్పించడం ఆ dictionary ప్రత్యేకత. చివరికి, మన సమోసా, చెడ్డీ లాంటి పదాలు కూడా ఆ డిక్షనరీలో చేరిపోయాయని మీకు తెలిసే వుంటుంది.

 

Post a Comment

0 Comments

Close Menu