మాయాబజార్ సినిమా పేరులో ఉన్నట్టే ఒక పెద్ద మాయ. మహాభారత పాత్రల మధ్య, నేపథ్యంలో ఎక్కడెక్కడో మహాభారతంలో ఉన్న సంఘటనలు వినిపిస్తూ సాగినా, స్థూలంగా చూస్తే ఈ కథ మహాభారతంలో లేదు. ఈరోజు మాయాబజార్ షష్టిపూర్తి చేసుకున్నాకా మనలో కొందరికి ఈ విషయం తెలిసివుండవచ్చు కానీ ఈ అరవై ఏళ్ళలో ఎందరో ప్రేక్షకులకు ఈ ముక్క తట్టలేదు, తెలియలేదు.
అంటే -
ఈ ప్రేక్షకుల దృష్టిలో కృష్ణుడు, అభిమన్యుడు, ఘటోత్కచుడు, బలరాముడు, సుభద్ర, రుక్మిణి, దుర్యోధన దుశ్శాసనులు, శకుని - వీరందరూ ఇలానే ప్రవర్తించి ఉంటారనీ, సాక్షాత్తూ మహాభారతంలోనే ఎక్కడో ఒకచోట ఈ కథ ఉంటుందని నమ్మకం కలిగినట్టే కదా. అలాంటప్పుడు మనోభావాల ప్రశ్నే ఉండదు.
సామాన్యంగా వక్రీకరణ, మనోభావాలు గాయపడడం అన్నవి - రాముడినో, కృష్ణుడినో ఆయా భక్తులు భావించేదానికి భిన్నంగానో, గౌరవభావంతో కాకుండా మరే ఇతర పద్ధతిలోనైనానో చూపిస్తే వస్తాయి.
మరి మాయాబజార్‌లో శ్రీ కృష్ణుడి పాత్ర విషయంలో అలాంటివి ఏమైనా ఉన్నాయా?
జై సత్య సంకల్ప, జై శేషతల్పా
జై దుష్ట సంహార, జై దీనకల్పా
జై భక్త పరిపాల, జై జగజ్జాలా
నీవు జరిపించేటి నీ చిత్రకథలు
రాసినా చూసినా వినిన ఎల్లరునూ
శుభసంపదలు కలిగి వర్థిల్లగలరు
సుఖశాంతులను కలిగి శోభిల్లగలరు
అంటూ ఘటోత్కచుడు కీర్తిస్తూండగా ముగుస్తుంది. సినిమా అంతటా కృష్ణుడి తెలివి, మాయ, మహత్యం అన్నీ చూపిస్తూనే వచ్చారు కదా.
మాయాబజార్ కృష్ణయ్య
పోనీ, సాక్షాత్తూ విష్ణుస్వరూపమూ, ఒకానొక అవతారమూ అయిన బలరాముడిని కోపధారిగా, ఆగ్రహం వస్తే పట్టలేని మనిషిగా, దుర్యోధనుడిపై అభిమానం ఉన్నవాడిగా ఎందుకు చూపించారని ఆగ్రహించే వీలుందా? - అదీ లేదు.
వ్యాసుని ప్రకారం చూస్తే - మహాభారత యుద్ధంలో పాల్గొనని అతికొద్ది మంది వీరుల్లో ఒకడు బలరాముడు. ఈయన ఇరుపక్షాలూ కొట్టుకుచావడం చూడలేనంటూ తీర్థయాత్రలు కారణంగా పెట్టుకుని వెళ్ళాడు. పోనీ, వెళ్ళినవాడు వెళ్ళినట్టే ఉన్నాడా అంటే లేదు. సరిగ్గా తన శిష్యులు భీమ దుర్యోధనులు గదాయుద్ధం చేసేనాటికి వచ్చి, ఆ యుద్ధాన్ని చూడాలని ఉందన్నాడు.
చివర్లో భీముడు దుర్యోధనుడి తొడలు విరగ్గొట్టి చంపితే ఆగ్రహావేశ భరితుడైపోయి భీముడు నియమోల్లంఘన చేశాడు, ఇతడిని చంపి తీరతాను అని తన హలాయుధాన్ని తెచ్చుకుంటే కృష్ణుడు అడ్డుకుని "దుర్యోధనుడికున్న శాపమూ, నిండు సభలో ద్రౌపదిని పరాభవించినపుడు తొడలు విరగ్గొడతానని భీముడి ప్రతిజ్ఞ గుర్తుచేశాడు" ఐనా అతను వినక "అర్థం, కామం కోరి ధర్మాన్ని విడిచిపెట్టాడని" భీముడిని నిందిస్తూ తన ఆవేశం తనదే అన్నట్టు ఉన్నాడు.
కృష్ణుడు అతనికి "ద్రౌపదిని అవమానించడమూ, అధర్మంగా పసివాడైన అభిమన్యుడిని చంపడమూ - ఇతర దుష్కృత్యాలూ గుర్తుచేసి, తన ప్రతిజ్ఞ చెల్లించటానికి ఇతను చేసిన పని అధర్మం కాదు. ఎన్నో కపట మార్గాలలో భీముడిని కడతేర్చాలని చూసిన దుర్యోధునడిని కపట మార్గంలోనే చంపడం తప్పు కాదని" ఎన్నో విధాల వివరించాకా కూడా ఈసడించుకునే వెళ్ళిపోయాడు.
అటువంటి బలరామునిలో దుర్యోధన పక్షపాతం, ఆవేశం, కోపంలో ఒళ్ళు తెలియనితనం లేవని ఎవరు అనగలరు. అవి చూపిస్తే మాయాబజార్ వక్రీకరించినట్టు కాదు కదా? ఆనాడు ఊళ్లలో భారతాన్ని పారాయణల ద్వారా వినివున్న ప్రేక్షకులు అలానే స్వీకరించి ఉంటారనుకోవాలి.
ముక్కోప ముఖప్రీతిరాయుడు శ్రీ బలరామునిగా గుమ్మడి
ఇక మిగిలిన పాత్రల విషయానికి వద్దాం:
ఘటోత్కచుడు - రాక్షసుడే అయినా భీమ పుత్రుడు, మంచివాడు, పాండవుల పట్ల భక్తి కలవాడు. సాహస పౌరుషవంతుడు.
అభిమన్యుడు - తండ్రికి తగ్గ తనయుడు, సాహస ప్రతాప సంపన్నుడు. ఇది మహాభారతంలో అతని ఘనతకు తగ్గట్టే ఉంది కదా.
రుక్మిణి - సౌమ్యురాలుగా, మంచిదానిగా చూపించారు.
సుభద్ర - పౌరుషవంతురాలిగా చూపించారు.
రేవతి - ధనాశపరురాలిగా, తత్కారణంగా పాండవులపై ప్రతాపాలపై గౌరవం లేనిదానిగా చూపించారు. అసలు రేవతి ఎలాంటిదో తెలియదు కనుక, మన ఇళ్ళలో ఎవరో పెద్దత్తనో, పెద్దమ్మనో తలపించేలా ఉంది కనక గొడవ లేదేమో.
శశిరేఖ - నాకు తెలిసి ఈమె అసలు ఇతిహాస పాత్ర కాదు. పూర్తిగా ఈ నాటకం/సినిమా కోసం కల్పితమైన పాత్ర. గొడవ ఏముంది.
దుర్యోధన దుశ్శాసన కర్ణులు - వీళ్ళను దుర్మార్గ వర్తనులుగానే చూపించారు.
శకుని - పాచికలు విసిరి మోసపుచ్చిన మనిషిలానే ఇందులోనూ కనిపిస్తాడు కదా.
లక్ష్మణ కుమారుడు - మహాభారతంలో ఇతని ప్రస్తావన కురుక్షేత్ర యుద్ధంలో వస్తుంది, వచ్చిన వెంటనే మరణించడమూ జరుగుతుంది. ఇందులో హాస్య పాత్రగా, పౌరుష హీనుడు, గప్పాల రాయుడుగా చూపించారు. కానీ, వివాదమేమీ అవడానికి వీలు లేదు.
మిగిలినవి అప్రధాన పాత్రలు కాబట్టి గొడవే లేదు.
0 Comments