Ad Code

Responsive Advertisement

టాప్ లోడ్, ఫ్రంట్ లోడ్ రకాల్లో ఏ వాషింగ్ మెషీన్లు బట్టలు బాగా ఉతుకుతాయి? ఎందుకు?

 

ఒక బకెట్‌లో బట్టలు నానబెట్టి చేత్తో యెడాపెడా అటూ ఇటూ కలబెడుతూ కలవరపెడితే టాప్ లోడ్ మెషీన్ పనితీరును కాపీ కొట్టినట్టే:

అదే ఒక డ్రమ్ములో నిలువుగా నాలుగు కమ్మీలు బిగించి, బట్టలు, కాసిన్ని నీళ్ళు వేసి, డ్రమ్మును అడ్డంగా పడుకోబెట్టి, సవ్య దిశలో కొన్ని సార్లు, అపసవ్య దిశలో కొన్ని సార్లు తిప్పుతూ ఉండటం ఫ్రంట్ లోడ్ మెషీన్ పనితీరు:

చిత్రమూలం: Top Load vs Front Load Washing Machine India

పనితనం

రోజువారీ బట్టల మన్నిక దెబ్బ తీయకుండా వాటిని ఉతకటానికి ఫ్రంట్ లోడ్ మెషీన్ మంచిది. తక్కువ నీరు అవసరం, ఎందుకంటే డ్రమ్ అడ్డంగా ఉండటం వల్ల తక్కువ నీటిలో బట్టలను నానబెట్టటం, ముంచి తీయటం సాధ్యం.

ముఖ్యంగా ఈ కారణానే ఫ్రంట్ లోడ్ మెషీన్లు తక్కువ సమయంలో బట్టలు ఉతికేస్తాయి, తక్కువ విద్యుత్తును వాడతాయి. పైగా ఉతకటం అయ్యాక నీటిని బయటకు తోసేసి డ్రమ్ వేగంగా తిరిగి బట్టలు పాడు కాకుండానే 80% వరకు తడి ఆరుస్తుంది. ఆపై ఒకట్రెండు గంటలు గాలి తగిలేలా ఆరేస్తే చాలు.

టాప్ లోడ్ మెషీన్‌లో డ్రమ్ నిలువుగా ఉండటం వల్ల బట్టలు మునగటానికి ఎక్కువ నీరు అవసరం. పైగా అన్ని నీళ్ళు సహా బట్టలను తిప్పటానికి ఎక్కువ సమయం, విద్యుచ్చక్తి అవసరం.

చిత్రమూలం: Top Load vs Front Load Washer: Each has its own Benefit

టాప్ లోడ్ వాషింగ్ మెషీన్ చాకలి రేవులో బండకేసి ఉతకటం వంటిదైతే, ఫ్రంట్ లోడ్ మనం ఇంట్లో పిండుకున్నట్టు ఉతకటం వంటిది. దేని ప్రయోజనం దానిదే!

దళసరి దుప్పట్లు, తువాళ్ళు టాప్ లోడ్ మెషీన్‌లో కాస్త ఎక్కువ శుభ్రం అవుతాయి కానీ కాటన్, లైనెన్ దుస్తులు టాప్ లోడ్ మెషీన్‌లో తరచూ ఉతికితే ఎక్కువ కాలం మన్నవు.

ఊరికే:

టాప్ లోడ్ మెషీన్ ఎక్కువ నీరు వాడుతుంది కావున ఆఖరుకు బట్టలకు అంటిన డిటర్జెంట్ తేలిగ్గా పోతుంది. అదే డిటర్జెంట్ ఫ్రంట్ లోడ్ మెషీన్‌లో వేస్తే తక్కువ నీటి వాడకం, సమయం వల్ల డిటర్జెంట్ పూర్తిగా పోదు. అందుకే వేటికవే వేరు డిటర్జెంట్ రకాలు ఉంటాయి.

నా అనుభవంలో ఫ్రంట్ లోడ్ మెషీన్లతో ఉన్న ఏకైక తలనొప్పి దాని శుభ్రత. మూత లోపల చుట్టూ ఉన్న రబ్బర్ బీడింగ్ ప్రతి వాడకం తరువాత పొడి బట్టతో తుడుచుకోకపోతే మోల్డ్ (ఒక రకమైన బూజు) వంటిది పట్టేస్తుంది. పోనుపోను ఎక్కువై దుర్వాసన కలిగించటమే కాక బట్టలకూ అంటుకోగలదు.

Post a Comment

0 Comments

Close Menu