ఫ్రెండ్స్ తెనాలి రామకృష్ణ అనే కవి శ్రీకృష్ణదేవరాయల ఆస్థానం లోని 'అష్టదిగ్గజాలు' అనే 8 మంది కవులలో ఒకరు..అయితే ఆయన ఇంటి పేరు తెనాలి కాదు. గారపాటి ఆయన ఇంటి పేరు. తెనాలి లో పుడటం వలన మరియు ఇంకా కొన్ని కారణాల వలన ఆయన పేరుకు ముందు తెనాలి అనే పదం చేరింది.అయితే ఆయన్ను కొంతమంది తెనాలి రామలింగడని లేదా తెనాలి రామకృష్ణుడని పిలుస్తారు. ఆయన అసలు పేరు ఏమిటి? ఎందుకు రెండు పేర్లు ఉన్నవి?తల్లి తండ్రులు పెట్టిన పేరు ఏమిటీ అనే ఆసక్తికరమైన విషయాలు చదవండి..
సుమారు 500 సంవత్సరాల క్రితం ఆంధ్రదేశం రాజధానిఅమరావతిలో కృష్ణాతీరం, గుంటూరు మండలంలో, తెనాలి అగ్రహారంలో, నియోగి బ్రాహ్మణుడు, కౌండిన్యస గోత్రీకుడు, ఆపస్తంభ సూత్రుడు అయిన గార్లపాటి రామన్న, ఆయన ధర్మపత్ని లక్ష్మమాంబ దంపతులకి లేకలేక ఒక మగపిల్లవాడు కలిగాడు.రామన్న పంతులుగారు రెడ్డిరాజుల కొలువులో కొంతకాలం మంత్రిగా పనిచేశారు. వారి సమర్థతకి, సమయస్ఫూర్తికి ప్రభువులు ఎంతో ప్రశంసించారు.
కానీ ఆయన ముక్కోపి. ఎప్పుడూ వారికి ముక్కుమీదే వుంటుంది కోపం. ఆముక్కోపమే వారి మంత్రి పదవిని ఊడగొట్టింది. ఒకరోజు అతి చిన్న విషయానికి ప్రభువుతో మాటామాటా పెరిగి “మీరెంత? మీ బోడి ఉద్యోగం ఏపాటి?” అనేసి పదవి వదిలేసి ఎంచక్కా తమ పూర్వీకుల యీనాం గ్రామం అయిన తెనాలి అగ్రహారానికి, సొంతింటికి తిరిగొచ్చేశారు.రామన్నగారి పదవిపోయింది గానీ, దాంతోపాటు అంటుకున్న దర్జా, డాబుపోలేదు. పైగా, స్వతహాగా దానధర్మాలకి పెట్టింది పేరు. అంచేత ఏ పండగొచ్చినా,పబ్బం వచ్చినా ఆఖరికి పిల్లిపిల్ల సమర్తాడినా కూడా సమస్త బంధువర్గమూ వారింటి మీద వాలేది. వారాలు, నెలలూ తరబడి మేసి, మేసి తీరిగ్గా తిరుగుప్రయాణం కట్టేవారు. అట్లా బంధువుల మర్యాదలకీ,రామన్నగారి దానధర్మాలకీ తాతముత్తాతల కాలం నాటి ఆస్థిపాస్థులన్నీ తరిగిపోయాక... గుంభనంగా కాలం గడుపుకొస్తున్న రామన్నగారి దంపతుల నోములు ఫలించి వారికి కొడుకు పుట్టాడు.
రామన్నగారికి కొడుకు పుట్టాడంటే మాటలా? ఎక్కడెక్కడి బంధువులందరూ
బారసాలకి కట్టగట్టుకుని దిగిపోయారు. తెనాలి అగ్రహారం కవులకి, కళాకారులకి,పండితులకి పుట్టినిల్లు. పైగా ఆ అగ్రహారానికి ధర్మాధికారి, పూర్వమంత్రి అయిన రామన్నగారింట వారి పుత్రుడికి బారసాల, నామకరణ మహోత్సవం. అంచేతఅగ్రహారంలోని పండితులందరూ శాలువాలు సవరించుకొంటూ చేరిపోయారు.పండితుల్లో ఒకరు ఆ పిల్లవాడి జననకాల లగ్నాన్ని పరీక్షించి ఆహ ..! వీడు మహర్జాతకుడు. కాలాన్ని తన ప్రతిభతో కట్టిపడెయ్యగల సమర్థుడు.రాముడిలా మాట తప్పనివాడు, కృష్ణుడిలా మనసెరిగినవాడు అవుతాడు” అన్నాడు.
"అయితే, యింకేం.... 'రామకృష్ణ' అని పేరు పెట్టండి" అన్నారెవరో..
రామన్నగారు తల పంకించి "మా ముత్తాతగారి పేరు అదే” అన్నాడు, కొడుక్కి ఆ పేరు పెట్టడానికి మానసికంగా సంసిద్ధుడై పోతూ.
అంతలో బంధువుల్లో ఎవరో కల్పించుకొని “మన గణపతిశాస్త్రుల వారేదో సంకోచిస్తున్నట్లున్నారు” అన్నాడు.
“ఇందులో సందేహించడానికేముంది, నా బొంద. ఈ
పిల్లవాడు మహర్జాతకుడే కానీ... రాముడిలా మాటిస్తూనే దాన్ని ఎలా ఎగొడదామా' అని ఆలోచించే రకం. కృష్ణుడిలా అందరి మన్ననలు పొందుతూనే గండాల పాలవుతుంటాడు. తానెంత సంపాదించినా తనకోసం ఏమీ దాచుకోని భోళా శంకరుడు. ఘనుడు, ఘటికుడే గానీ.... 'లింగడు...దోసెడు నీళ్లు, చిటికెడు భస్మంతో సంతృప్తి చెందే 'రామలింగడు....” అన్నాడు గణపతిశాస్త్రుల వారు.
వెంటనే యింకో బంధువు కల్పించుకొని “ఇకనే... 'రామలింగడు' అని పేరు పెట్టండి” అనేశాడు.
రామన్నగారి అర్థాంగి, బాలుడి తల్లి, బాలింతరాలైన లక్ష్మమాంబ ముసిముసిగా నవ్వి “మా ముత్తాతగారి తండ్రి పేరు రామలింగడే...” అంది.
“అయ్యా, రామన్నగారూ! సుముహూర్తం దాటిపోతోంది. పిల్లవాడి పేరు ఏమిటో నిర్ణయించండి మరి. రామకృష్ణుడా? రామలింగడా?” అని అడిగాడు బారసాల కార్యక్రమం జరిపిస్తున్న పురోహితుడు.
“ఇందాకే మా అన్నయ్య చెప్పాడు కదా.... రామకృష్ణ అని... ఏం అన్నయ్యా "అంది రామన్నగారి చెల్లెలు, ఇంటి ఆడపడుచు “అదెట్లా వీలవుతుంది? ఏం బావా? మా చెల్లెలు కాపురానికొచ్చిన యిన్నేళ్లకి ఒక్క కోరిక కోరింది. అది తీర్చలేవా? 'రామలింగడు' పేరు పెట్టాల్సిందే” అన్నాడు పిల్లవాడి మేనమామ ఖరాకండిగా.
“ఓయబ్బో!... ఉత్తగొడ్డుకి అరుపులెక్కువ అన్నట్టు... మా అన్నయ్య కొడుకు మీద మీ పెత్తనం ఏమిటి, బోడి పెత్తనం? మీ రామలింగం సప్తవ్యసనాల్లో పీకల్దాకా కూరుకుపోయి కొంపాగోడూ వదిలేసి సన్నాసుల్లో కల్సి దేశాలు పట్టిపోయాడు. ఆ బైరాగోడి పేరు మా అన్నయ్య కొడుక్కి ఎలా పెద్దాం?” అనేసింది. ఇంటిఆడపడుచు ఈసడింపుగా,
“చెప్పొచ్చావు లేవమ్మా, మహా... మీ బోడిగొప్ప ఎవరికి తెలియదూ? మీ రామకృష్ణయ్య తక్కువ తిన్నాడా? ఇంట్లో మహాలక్ష్మిలాంటి ఇల్లాల్ని క్షోభపెట్టి. ఇంటి పెరట్లో ఒకదాన్తో, పొలంలో మరొకదాన్తో, చెరువుగట్టుకాడ ఇంకోదాన్తో...ఇట్లా అడ్డమైన వాళ్లతో సంబంధాలు పెట్టుకొని కుష్ఠురోగం వచ్చి కొట్టుకు పోయాడు,అట్లాంటి రోగి పేరు మా చెల్లెలు కొడుక్కి ఎలా పెద్దాం?” అనేశాడు.అన్నాడు పిల్లాడి మేనమామ
"పెట్టడానికి నువ్వెవరు? పెట్టించుకోడానికి ఆ బికారిగాడెవరు? వీడు మా అన్నయ్య కొడుకు. అన్నయ్యకి నేనంటే యిష్టం. అంచేత నామాటే వింటాడు. నేచెప్పిన సరే పెట్టాడు... ఏమంటావు అన్నయ్యా?....” అంది ఆడపడుచు దీర్ఘాలు తీస్తూ.
"ఏంటి పెట్టేది, పేడకడి? వీడు మా చెల్లెలికి లేక లేక పుట్టిన ఒక్కగానొక్కడు.వంశోద్దారకుడు,ఈ వరపుత్రుడికి ఆ కుష్ఠు చచ్చినాడి పేరు పెడ్తానంటే మా చెల్లెలు ఒప్పుకుంటుందా? దాని మాట మా బావ కాదంటాడా?...ఏం బావా....”బల్లగుద్దుతూ.
"అదేం కాదు. నా మేనల్లుడి పేరు రామకృష్ణుడే...” అది ఆడపడుచు.
“కుదర్దంటే కుదర్దు... రామలింగడే...” అరిచాడు మేనమామ. ఇద్దరూ గొర్రెపొట్టేళ్లలా పోట్లాడుకుంటుంటే బంధువులందరూ పళ్లు వెళ్లబెట్టి వినోదంగా చూస్తుంటే... "ముహూర్తం మించిపోతోంది. త్వరగా చెప్పండి. రామకృష్ణుడా?రామలింగడా?” తొందరజేశాడు పురోహితుడు. గార్లపాటి రామన్నగారికి చిరాకెత్తుకొచ్చి “ఎవరికిష్టం వచ్చిన పేరుతో వాళ్లు పిలుచుకోండి. ఈ తిక్కవెధవకి నేను పేరు పెట్టేంతటి వాడ్నా?” అని అరుస్తూ లేచి వెళ్లిపోయాడు.
తన పేరు 'రామకృష్ణుడా?..... రామలింగడా?” అన్న సందిగ్ధాన్ని బారసాలనాడే రేకెత్తించిన ఆ పసివాడే లోకవ్యాప్తంగా ప్రసిద్ధుడైన 'వికటకవి' తెనాలి రామలింగడు. ఇతని ఆ కాలం లో ఆయన బంధువులు రెండు పేర్లతో పిలిచే వారు.కాలక్రమేణా జనం కూడా రెండు పేర్లతో పిలిచే వారు.
బారసాలనాడే తల్లికి తండ్రికి మధ్య తగువు' కల్పించిన అతడి జీవితమంతా వినోదాత్మకం, విజ్ఞానాత్మకం, వివాదాత్మకం. ఐనా ప్రతి విషయం సుఖాంతం, శుభాంతం. అందుకే తెనాలి రామలింగ కథలు లోక ప్రసిద్ధాలయ్యాయి.
తన జీవిత సంఘటనలనే దేశ ప్రయోజనాలుగా మార్చుకున్న వికటకవి, కాళికాదేవిముద్దుబిడ్డడు తెనాలి రామలింగ కథలు...
ఫ్రెండ్స్ ఈ ఆర్టికల్ మీకు నచ్చితే అందరికి షేర్ చేయండి..ధన్యవాదాలు.. మీకు..
0 Comments