Ad Code

Responsive Advertisement

తమిళ భాషను తెలుగువారు "అరవం"అని ఎందుకు అంటారు?

 


మన మునుపటి తరం తెలుగు వాళ్ళు తమిళాన్ని అరవం అనీ తమిళ వారిని అరవవాళ్ళు అనీ పిలవటం మనం చాలా సార్లు వినే ఉంటాం. ఇలా ఎందుకు పిలుస్తారంటే - పూర్వం తమిళ ప్రాంతాలను 'మండలం' అనే పేరుతో వ్యవహరించేవారు. ఈ మండలాలు ఈనాటి మన రాష్ట్రాలలాగా అనమాట. చోళ మండలం, పాండ్య మండలం ఇలా వివిధ ప్రాంతాలకి వివిధ పేర్లు ఉండేవి. అటువంటిదే ''తొండై మండలం'' కూడా, ఈ తొండై మండలంలోనిదే అరువనాడు. ఈ ప్రాంతం తెలుగుదేశానికి దక్షిణ సరిహద్దులో ఉండేది. ఈ అరువనాడు ప్రస్తుత చిత్తూరు, నెల్లూరులోని కొంత భాగం వరకు విస్తరించి ఉండేది. తెలుగు వారికి అతి సమీపంలో ఉన్న రాజ్యం అరవనాడే కావడంతో ఆ రాజ్య ప్రజలను అదే పేరుతో పిలుస్తారు. అరవప్రజలు మాట్లాడే భాష మనకి అర్థం కాదు కనుక అదే రాజ్యం పేరు మీద అరవభాష, అరవం అని పిలుస్తున్నారు.

మనం మాత్రమే కాదు తమిళులని ఇలా రాజ్యం పేరుతో పిలిచేది, కన్నడిగులు తమిళులను కొంగ అని పిలుస్తారు ఎందుకంటే కొంగునాడు ప్రాంతం కర్నాట దేశానికి సరిహద్దుల్లో ఉంటుంది కనుక వారికి తెలిసిన తమిళులు ఈ ప్రాంతం వారే కనుక వారు తమిళులను కొంగ అని అంటారు. అలాగే మలయాళీలు తమిళులను పాండీ అంటారు, వీరికి పాండ్యనాడు సరిహద్దు కాబట్టి పాండ్యనాటి తమిళులను పాండీ అని మలయాళీలు పిలుస్తారు.

ఇవి చారాత్రకంగా వచ్చిన పేర్లే తప్ప తమిళవారిని తూలనాడటానికో లేదా కించపరచటానికో వాడే పదాలు కావు

Post a Comment

0 Comments

Close Menu