“ ఓ శమీ వృక్షమా .. మా పాపాల్ని తొలగించేది నువ్వే . అర్జునుడు ధనుస్సు దాచింది నీ దగ్గరే ! రాముడికి విజయం చేకూర్చిందీ నువ్వే . శ్రీరాముడు పూజించినట్లే నేనూ నిన్నుపూజిస్తున్నాను . ఎలాంటి ఆటంకాలు లేకుండా నా విజయయాత్రను సుఖమయం చెయ్యి " అని దసరానాడు జమ్మి చెట్టుని పూజిస్తూ .. పై శ్లోకాన్ని రాసిన చీటీలు చెట్లకు తగిలించాలి . కానీ , ఇలా చేసేవాళ్లు చాలా తక్కువ . చెట్టుకి , ఆలయాల్లో ఏర్పాటు చేసిన కొమ్మలకి పూజలు చేసి జమ్మి ఆకుల్ని తెంచుకుని పంచుకుంటారు . అన్నింటా జమ్మి ! జమ్మి ఒక ముళ్ల చెట్టు . సాధారణంగా అడవుల్లో , పొలాల గట్ల మీద పెరుగుతాయి . మెడిసినల్ గుణాలున్న చెట్టు ఇది . ఆయుర్వేదంలో చర్మ సంబంధ వ్యాధులకు మందుగా జమ్మి ఆకులు , బెరడుని వాడతారు . కానీ , ఈ చెట్టుతో ఆధ్యాత్మికత కూడా ముడిపడి ఉంది . దసరా వస్తే పవిత్రమైన చెట్టుగా పూజలందుకుంటుంది . జమ్మి పవిత్రత గురించి పురాణాల్లో ఒక కథ ఉంది . దేవతలు , రాక్షసులు క్షీరసాగర మధనం చేపట్టినప్పుడు .. పాలకడలి నుంచి కల్పవృక్షంతో పాటు మరికొన్ని దేవతా వృక్షాలు పట్టాయి . వాటిలో శమీ ( జమ్మి ) చెట్టు కూడా .యజ్ఞయాగాలు చేసే టైంలో రెండు కర్రలతో అగ్నిని వెలిగిస్తారు . అవి శమీ చెట్టు కర్రలే . దీన్ని ' అరణి ' అని పిలుస్తారు . వినాయకచవితి టైంలో చేసే వ్రతాల్లో జమ్మి ఆకుకి కూడా ప్రాధాన్యం ఉంటుంది . ఇతిహాసాల వల్ల జమ్మి చెట్టుకి మరింత ప్రాధాన్యం పెరిగింది . వనవాసానికి వెళ్లిన రాముడు జమ్మి చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నాడు . రావణుడితో యుద్ధానికి ముందు జమ్మి ఆకులతో ఆదిపరాశక్తిని పూజించాడు . తిరిగి అయోధ్యకి వెళ్లేటప్పుడు కూడా జమ్మి చెట్టుకి పూజలు చేశాడు . మహాభారతంలో అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు తమ రాజవస్త్రాల్ని , ఆయుధాల్ని జమ్మి చెట్టుపైన దాచి ఉంచారు . అజ్ఞాతవాసం ముగిశాక జమ్మి చెట్టుకి పూజలు చేసి గాండీవాన్ని చేతబట్టిన అర్జునుడు .. ఉత్తరకుమారుడికి అండగా నిల్చుని కౌరవ సేనని తరిమికొట్టాడు. అపరాజిత దేవి తనను పూజించిన వాళ్లకు విజయాల్ని అందిస్తుంది . శమీ వృక్షాన్ని అపరాజిత దేవి ప్రతిరూపంగా కొలుస్తారు . ఇంత గొప్పదనం , పవిత్రత ఉండటం వల్లే పురాణ కాలం నుంచి నేటి వరకు చెడుపై మంచి సాధించిన విజయదశమి రోజున శమీపూజను ఆచరించటం ఆనవాయితీగా వస్తోంది . జమ్మి ఆకుని ' బంగారం'గా పంచుకుంటూ అలయ్ - బలయ్ చేసుకోవడం , పెద్దవాళ్ల దగ్గర ఆశీర్వాదాలు తీసుకోవడం ఆచారంగా వస్తోంది . అయితే నార్త్ ఇండియాలో జమ్మి ఆకుని పంచుకునే ఆచారం ఎక్కువగా కనిపించదు.
ఆయుధపూజ మహాభారతంలో పాండవులు జమ్మిచెట్టు సమక్షంలో ఆయుధాల్ని పూజించారనే ప్రచారం వల్ల .. కొన్ని తరాలుగా ఆయుధపూజ ఒక సంప్రదాయంగా వస్తోంది . అయితే తర్వాతి రోజుల్లో ఆయుధ పూజ తీరు మారింది . మెషిన్లకు , వెహికల్స్ కి పూజలు చేసే కల్చరు అలవాటు చేసుకున్నారు . పిల్లలకు అక్షరాభ్యాసం చేయించేందుకు దుర్గాష్టమి లేదంటే విజయదశమి ( దసరా ) ని పేరెంట్స్ మంచి సందర్భంగా భావిస్తారు . స్టూడెంట్స్ కూడా తమ పుస్తకాలకు , ఇప్పుడైతే స్మార్ట్ ఫోన్లకు , ల్యాప్ టాలకు పూజలు చేస్తున్నారు . వ్యాపారులు షాపుల్ని , మేనేజ్ మెంట్స్ కంపెనీలను పువ్వులతో డెకరేట్ చేసి దుర్గాదేవి పూజ చేస్తారు . కొత్తగా వ్యాపారం ప్రారంభించేవారు దుర్గాష్టమి , విజయదశమి రోజుల్లో ఆరంభించడం శుభసూచకంగా భావిస్తారు . అందుచేత దుర్గాష్టమి రోజున శక్తిపీఠాలను దర్శించుకోవడం లేదా దగ్గరిలోని అమ్మవారి ఆలయాలను సందర్శించడం చేయాలని పండితులు చెబుతున్నారు . కొత్త బండ్లకు పూజలు చేయించడం సాధారణం . కానీ , దసరా రోజున సైకిల్ నుంచి ట్రాక్టర్ దాకా , పోలీసుల గ్న దగ్గరి నుంచి మిలిటరీ విమానాల దాకా అన్నింటికి పూజలు చేస్తారు . వాహనాలకి పూజలు చేసేటప్పుడు గుమ్మడి కాయని బలి ఇవ్వడం ( దిష్టి తిప్పి నేలకి కొట్టడం ) ఒక ఆనవాయితీగా వస్తోంది . అంతేకాదు నిమ్మకాయల దండల్ని బండ్లకు వేస్తారు .
0 Comments