Ad Code

Responsive Advertisement

గబ్బిలాలు గురించి మీకు ఎంత తెలుసు? మనిషి నేర్చుకున్న విషయాలు ఏమిటి?

ఫ్రెండ్స్ గబ్బిలాలు గురించి మీకు ఎంత తెలుసు? మనిషి నేర్చుకున్న విషయాలు ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోండి





పక్షులూ, కీటకాలూ కూడా ఎగురుతాయి. కానీ అవేవీ తలకిందులుగా వేలాడవు.ఈ అవసరం ఒక్క గబ్బిలాలకే ఎందుకు కలిగింది?మిగిలిన పక్షులన్నీ ఎగరగలిగినప్పటికీ అవి అవసరమైతే కాళ్ళతో నడవగలవు.అలాగే కీటకాలూనూ. కానీ గబ్బిలాలు బొత్తిగా నడవలేవు. వాటి కాళ్ళకు నడిచే శక్తిలేదు. ఆఖరికి కాళ్ళమీద నిలబడను కూడా లేవు. కనుక, ఒకచోటి నుండి మరో చోటికి కదలి వెళ్ళాలంటే ఎగరడం తప్ప గబ్బిలాలకు మరో గత్యంతరం లేదు. అవి కాసేపు ఆగాలంటే రెక్కలకున్న గోళ్ళతో ఏ చెట్టుకొమ్మనో గోడ పగులునో పట్టుకుని తలకిందులుగా వేలాడడమే అన్నిటికన్న సులభమైన పని.

గబ్బిలం చాలా చిత్రమైన జీవి. క్షీరదాలలో ఎగరగలిగినది ఒక్క గబ్బిలమే. ఇది పిల్లలను కంటుంది. వాటికి పాలిస్తుంది. తల్లి గబ్బిలం వేటకి వెడుతూ పిల్లలను పొట్టకు కరుచుకుని ఎగురుతూ పోతుంది. ఎగిరే ఉడుతలు, ఎగిరే లేమూర్లు వున్నాయి కానీ పైనుంచి కిందకి నెమ్మదిగా“గ్లయిడ్” అవటం తప్ప నిజంగా ఎగరడం వాటికి చేతకాదు.

గబ్బిలం రెక్కలకీ, పక్షి రెక్కలకీ చాలా భేదం వుంది. పక్షుల రెక్కలకి ఈకలు వుంటాయి. వేళ్ళ మధ్యని గొడుగు బట్టలాగ సాగదీసిన చర్మంతో చేసిన రెక్కలు గబ్బిలాలకున్నాయి. దాని వేళ్ళలో బొటనవేలు తప్ప మిగిలిన వ్రేళ్ళు గొడుగు ఊచలలాగ పనిచేస్తాయి. బొటనవేలు మాత్రం పైకి పొడుచుకువచ్చి ఏ చెట్టుకొమ్మనో పట్టుకోవడానికి పనికివస్తుంది. ఆ పట్టు నిద్రలో కూడా జారిపోదు.వీటిలో చాలా భాగం పురుగుల్ని తింటాయి. కొన్ని పళ్ళు తింటాయి. కొన్ని పుప్పొడి నాకుతాయి. మరికొన్ని నిద్రపోతున్న జంతువుల రక్తం తాగుతాయి.

గబ్బిలాల “ఫాసిల్సుని” బట్టి ఇవి అధమం ఆరుకోట్ల సంవత్సరాలుగా ఈ

1 మీద నివసిస్తున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం గబ్బిలాలలో 2000 రకాలున్నాయి.

ఒక్క ధ్రువ ప్రాంతాలలో తప్పించి ఇవి మిగిలిన అన్నిచోట్లా కనిపిస్తున్నాయి. ఆరు అంగుళాల నుంచి ఆరు అడుగుల వరకూ రెక్కల నిడివిగల గబ్బిలాలున్నాయి. వీటిలో చాలా భాగం పురుగుల్ని  వీటిలో పక్షుల్ని తినేవీ, చేపల్ని పట్టేవి, రక్తం తాగేవి కూడా వున్నాయి.

గబ్బిలాలు ఎలా ఎగరగలుగుతున్నాయో చాలాకాలం వరకూ శాస్త్రజ్ఞులకు అర్థం కాలేదు.అది తెలుసుకోడానికి ఒక ప్రయోగం చేశారు. పెద్ద గదిలో అడ్డంగా తీగలు కట్టారు.కొన్ని గబ్బిలాలను పట్టుకుని, వాటి కళ్ళకి గంతలు కట్టి, ఆ గదిలో విడిచిపెట్టారు. అవి ఏ తీగకైనా తగిలితే ఒక గంట మోగేటట్లు అమర్చారు. ఒక్క తీగకైనా తగలకుండా మామూలు వేగంతో సునాయాసంగా అవి తీగల మధ్య సందుల్లోంచి ఎగరగలిగాయి. అంటే కళ్ళతో చూడకుండానే గబ్బిలం దారి తెలుసుకుంటుందన్నమాట! ఇది ఎలా సాధ్యం?

రెండవ ప్రయోగంలో గబ్బిలాల కళ్ళ గంతలు విప్పేసి, చెవులకు బిరడాలు పెట్టి ఆ గదిలో వదిలిపెట్టారు. ఈసారి అవి సరిగ్గా ఎగరలేకపోయాయి. మాటిమాటికీ తీగలకే కాక, గోడలకి కూడా గుద్దుకోవడం మొదలు పెట్టాయి. మూడవసారి వాటి నోరు కట్టేసి వదిలి పెట్టారు. ఈసారి కూడా అవి సరిగ్గా ఎగరలేకపోయాయి.దీన్నిబట్టి గబ్బిలం దారి ఏ విధంగా తెలుసుకుంటుందో అర్థం అయింది. అది ఎగురుతున్నప్పుడు నోటితో సన్నని కూత వేస్తుంది. ఆ కూత మామూలు శబ్ద తరంగాలకన్నా ఎక్కువ ఫ్రీక్వెన్సీ కలది కావటంచేత (సెకండుకి 45,000-50,000సార్లు) అది మన చెవులకు వినిపించదు; ఈ హై ఫ్రీక్వెన్సీ శబ్ద తరంగాలు ఎదర వున్న అడ్డంకికి తగిలి, ప్రతిఫలించి వెనక్కి తిరిగివచ్చి, గబ్బిలం చెవులకి తగులుతాయి. వీటి చెవులు బహు సున్నితమైనవి కావడంచేత పరావర్తనం చెంది తిరిగి వచ్చిన అల్పాల్పమైన శబ్దాలను విని, ఎదరనున్న అడ్డంకిని గుర్తించగలుగుతాయి. ఆ వస్తువు ఎంత దూరంలో వుందో, దాని సైజు ఎంతో, ఆ వస్తువు స్థిరంగా వుందో లేక కదులుతుందో, కదులు తుందన్నట్లయితే ఏ దిశలో ఎంత వేగంగా కదులుతుందో ఖచ్చితంగా తెలుసుకోగలుగుతాయి. తన శబ్ద తరంగాలను ప్రతిఫలించిన వస్తువు తాను తినడానికి పనికివచ్చేపురుగో, లేక తాను తప్పించుకోవలసిన చెట్టుకొమ్మో గ్రహించి, తదనుగుణంగా దిశను మార్చుకుంటూ కటిక చీకట్లో కూడా చెట్లకూ, పుట్టలకూ, స్తంభాలకీ గుద్దుకోకుండా వేగంగా పురుగును సమీపించడంగాని చేయగలుగుతాయి. వీటికి కళ్ళవల్ల ఉపయోగం బొత్తిగా లేకపోలేదు. ఆ వస్తువును సమీపించిన తరువాత అది తన తిండికి పనికి వచ్చేదో కాదో కళ్ళతో చూసి తెలుసుకోగలవు. ఇందులో ఒక చమత్కారం ఉంది. కొన్ని పురుగులు హై ఫ్రీక్వెన్సీ శబ్ద తరంగాలను గ్రహించి వెంటనే ఏమూలనో నక్కడానికి ప్రయత్నిస్తాయి. ఆ తరంగాలకూ, ప్రమాదానికీ సంబంధం వున్నదని అవి గ్రహించగలిగాయన్న మాట. సృష్టిలో పరిస్థితులకు అనుగుణంగా మార్పు చెందగలిగిన జీవులే జీవనపోరాటంలో నెగ్గుకు రాగలవన్న సిద్ధాంతానికి ఇదొక ఉదాహరణ.

గబ్బిలం నుంచి మనిషి నేర్చుకున్న అద్భుత విషయం ఒకటి ఉంది. గబ్బిలం శబ్ద తరంగాల నుపయోగించి, ఎదుటి వస్తువులను తెలుసుకునే పద్ధతిలోనే శాస్త్రజ్ఞులు “రాడార్” అనే పనిముట్టును రెండవ ప్రపంచ యుద్ధకాలంలో కనిపెట్టారు. శత్రవు విమానాలను బహుదూరాన వుండగానే పసికట్టడానికి ఇది పనికి వస్తుంది. ఇందులో శబ్దతరంగాలకు బదులు హైప్రీక్వెన్సీ రేడియో తరంగాలను ఉపయోగిస్తారు. ఎదర వున్న విమానానికి తగిలి, పరావర్తనం చెంది, తిరిగివచ్చిన తరంగాలను అందుకుని, ఆ విమాన ఎంత దూరంలో వుందో, ఏ దిశలో ఎంత వేగంతో ఎగురుతోందో తెలుసుకుంటారు.దానిని పడగొట్టడానికి అవసరమైన జాగ్రత్తలు ముందుగానే తీసుకుంటారు.







Post a Comment

0 Comments

Close Menu