వంతెనలకు స్తంభాలు నిర్మించేందుకు ప్రధానంగా కాఫర్‌డ్యామ్ (Cofferdam) విధానం వాడతారు.
టూకీగా:
స్తంభం కట్టవలసిన ప్రదేశం చుట్టూ మొదట లోహపు కడ్డీలు లేదా పలకలను దిగవేస్తారు. తరువాత లోపలి నీటిని బయటకు తోడేసి, ఆ ప్రదేశాన్ని ఎండనిస్తారు. ఆపై స్తంభం నిర్మాణాన్ని పూర్తిచేసి, లోహపు కడ్డీలను తొలగిస్తారు.
లోతుగా:
ముందుగా స్తంభాలు కట్టవలసిన ప్రదేశాలను గుర్తించి, అక్కడ నదీభూతలంపై ఉన్న మన్ను స్వభావాన్ని విశ్లేషిస్తారు. ఆ మన్ను ఎంత బరువును మోయగలదు నుండి ఎంత లోతులో పునాదులు వెయ్యాలి వంటి వివరాలకు ఈ విశ్లేషణ మొదటి అడుగు.
తదనుగుణంగా లోహపు కడ్డీల పొడవును నిర్ణయిస్తారు. కాఫర్‌డ్యామ్ నిర్మించాక బయట ఉన్న నీటి ఒత్తిడికి లోపల అడుగుభాగం నుండి నీరు ఊరే ప్రమాదం ఉంటుంది. అలా జరగకుండా కడ్డీలను పాతేందుకు తగిన లోతును లెక్కిస్తారు. లెక్కించినంత పొడవైన కడ్డీలను తయారు చేసి తెచ్చి నీటిలో పాతుతారు. నీటి లోతు, మన్నును బట్టి పూర్తి లోహపు కడ్డీలు లేదా కడ్డీల మధ్యన సిమెంటు నింపిన స్తంభాలు వాడతారు.
ఈ స్తంభాలు ఒకదానికొకటి గట్టిగా అంటుకుని ఉండేందుకు పలు అంతఃలాకుల (interlocking) విధానాలు కనిపెట్టారు.
కొన్ని ప్రదేశాల్లో కాఫర్‌డ్యామ్ లోపలి నేల నుండి నీరు ఊరటాన్ని పూర్తిగా నివారించటం కుదరదు. అలాంటి చోట్ల నిరంతరాయంగా నీటిని బయటకు తోడేసే పంపులను వాడతారు.
ఈ కాఫర్‌డ్యామ్ విధానాన్నే 19వ శతాబ్దంలో ఫ్రెంచ్ యుద్ధాల సమయంలో సైనిక బలగాలు నదులను దాటేందుకు వాడేవారు. అయితే కడ్డీలకు బదులు వేలాది ఇసుక మూటలను నీటి ప్రవాహానికి అడ్డువేసి తాత్కాలిక మార్గాన్ని నిర్మించుకునేవారు.
చరిత్రలో మొదటిసారి పర్షియా రాజైన సైరస్ క్రీ.పూ.539లో బాబిలాన్ నగరాన్ని ముట్టడించేందుకు గాను యూఫ్రెటిస్ నదిని మళ్ళించటానికి కాఫర్‌డ్యామ్ వాడాడు. తరువాత రోమన్లు చెక్కకొయ్యలు వాడి వంతెనలు నిర్మించేందుకు ఇదే విధానం వాడినట్టు ఋజువులు దొరికాయి.
ఇటీవలి కాలంలో చిన్న ప్రాజెక్టులకు నీటితో నింపిన బలూన్ల కాఫర్‌డ్యామ్ విధానం కూడా వాడబడుతోంది. ఇందులో శ్రమ, సమయం, ఖర్చు తక్కువ.
0 Comments