ఈభూమ్మీద సప్లయి నిలచిపోయి డిమాండ్ పెరిగేది భూమికి మాత్రమే . మీ పాపకు 15 , 20 ఏళ్ల తర్వాత అవసరం అయ్యే డబ్బు కోసం భూమి కొనడం మంచిది . కొనేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి .
1. పట్టణాలకు సమీపంలో ఉండి , 10- 15 ఏళ్ల తర్వాత పట్టణంలో కలిసిపోయే అవకాశం ఉన్న రోడ్డు పక్క వ్యవసాయ భూమి కొనండి . అందులో తోటలు పెంచండి . 10-15 ఏళ్ల తర్వాత ప్లాట్లుగా చేసి అమ్మితే నష్టం ఎలా వస్తుంది ?
2 అమావాస్య , పౌర్ణమికి సముద్రం పొంగినట్లు ప్రతి పదేళ్లలో రెండు , మూడుసార్లే భూముల విలువల్లో బూమ్ వచ్చే అవకాశం ఉంది . బూమ్ వచ్చి పోయాక కొనడం కంటే ముందే భూమిని కొనాలి . మీరు కొనబోయే భూమి ధర గత ఒకటి రెండు సంవత్సరాలలో అనూహ్యంగా పెరిగి ఉంటే , కొనటంలో తొందరపడవద్దు . ప్రస్తుతం ఆ భూమికి అంత విలువ పెట్టొచ్చా లేదా చూసుకొని కొనండి .
3 భూముల ధరలు అమ్మే వాడి అవసరం , కొనేవాడి మోజును బట్టి నిర్ణయింపబడతాయి . కాబట్టి సమీప భవిష్యత్తులో అవసరంలేని మొత్తాన్నే రియల్ ఎస్టేటు మళ్ళించండి .
4 అవసరం , మోజును బట్టి భూమి ధర ఉంటుంది కాబట్టి , భూమి బేరసారాలు ఒక సైకలాజికల్ గేమ్ లా ఉంటాయి .. ఆ గేమ్ ఎంజాయ్ చేసుకుంటూ ... పెట్టుబడి పెట్టండి .
5 భూమి కొనేటప్పుడు ఇది తప్పితే భూమ్మీద మరో చోటు దొరకదు అన్న భయంతో బేరం ఆడొద్దు . మీ ముఖ కవళికలని బట్టి అవతలి వ్యక్తి ధర పెంచేస్తాడు .
6. మీరు ఇల్లు కట్టాలి అనుకున్నపుడు ఇది తప్పితే ఈ ప్రాంతంలో మరొకటి నచ్చినది దొరకదు అనిపిస్తే కొంత ధర ఎక్కువ పెట్టొచ్చు . కానీ పెట్టుబడిగా కొనేటప్పుడు ఈ ఊరు కాకపోతే మరో ఊరు వెళ్లి కొంటాం అన్నట్లు భావించి బేరం ఆడితే మీ బేరంలో ధైర్యం వస్తుంది .
7 మీకు డబ్బు అవసరం సమీపించేటప్పటికి ( ఉదా : అమ్మాయి పెళ్ళి ) ఒకటి , రెండేళ్ళ ముందే భూమి అమ్మి , బ్యాంక్లో ఫిక్సిడ్ డిపాజిట్గా వేసుకోండి . అవసరం వచ్చినప్పుడు అమ్ముకుందామంటే మోజుపడి కొనుక్కునే వ్యక్తి దొరకటం అన్ని సమయాల్లో సాధ్యం కాకపోవచ్చు .
8 రియల్ ఎస్టేట్ 5 , 10 , 15,20 ఏళ్ళ తర్వాత భవిష్యత్తును అంచనా వేసి పెట్టుబడి పెట్టే వ్యక్తికి సాధారణంగా నష్టం రాదు .
9 25 ఏళ్ళ తర్వాతి అంచనాతో మీ అమ్మాయి పెళ్ళి కోసం మీరు భూమికొన్నారు.మీరు 5 ఏళ్ళ తర్వాత భూమి ధర తగ్గితే కంగారు పడవద్దు .మీరు అమ్మే వరకు మీ భూమి పై మీకు నష్టం రాదు . ఈ లోగా మీ నష్టం అంతా కాగితాలకే పరిమితం . అయితే , 25 ఏళ్ళ తర్వాతి మీ అంచనా ను తాజా పరిస్తితిలో పునరాలోచించుకోండి .
10 పక్క వాడికి చెప్పలేనంత లాభం వచ్చేసింది . నాకు మిస్ అయిపోతోంది అన్న అత్యాశతో రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్ట వద్దు . రియల్ ఎస్టేట్ ధర , వాటి హెచ్చు తగ్గుల పట్ల విశ్వాసం ఉన్నపుడే రియల్ ఎస్టేట్లోకి వెళ్ళండి . లేకుంటే అనవసరంగా వెళ్లి చేయి కాల్చుకున్న వారుగా మిగిలిపోతారు .
11 మనం అమ్మగానే , అమ్మిన భూమి ధర పెరిగితే కుంగి కృశించి పోవడం తెలివి తక్కువ పని . కొన్నవాడు కూడా లాభపడాలి అన్న స్థితప్రజ్ఞత రియల్ ఎస్టేట్ లో కూడా చాలా అవసరం .
12 ఇవాళ కొని , ఒక నెలలో అమ్మి లాభాలు కొట్టేద్దామని రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టకండి . కనీసం ఐదేళ్ళు ' హెూల్డ్ ' చేయగలమన్న మొత్తం వరకే పెట్టుబడి పెట్టటం క్షేమం . నెలలో రేటు బాగా పెరిగి , లాభం వస్తే అది బోనస్ భావిద్దాం అనుకుని పెట్టుబడి పెట్టండి .
13 అప్పు తెచ్చి రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టడం క్షేమం కాదు . మీరు కొనబోయే స్థలం ఉండాల్సిన ధర కంటే చాలా తక్కువకే వస్తుందన్న వాస్తవ అంచనాకు మీరు వస్తే కొంత అప్పు చేసి భూమి కొనొచ్చు . కానీ హరాయించుకోగల స్థాయి . వరకే అప్పు చేయండి . ఆ భూమి అమ్మటం ద్వారా అప్పు తీర్చడం కుదరకపోయినా , ఇతర మార్గాల ద్వారానయినా అప్పు తీర్చగల అవకాశం ఉన్నంత వరకే అప్పు చేయండి . ఆ అప్పు కూడా బ్యాంక్ వడ్డీకి మించకుండా చూసుకోండి . 2,3 రూపాయలకి వడ్డీకి తెచ్చి కోలుకోలేని దెబ్బలు తిన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు . అత్యాశ ' అసలుకే నష్టం .
14 స్థలం కొనేటపుడు అమ్మే వ్యక్తికి అమ్మే హక్కు ఉన్నదీ లేనిదీ చూసుకోవడం , లీగల్ క్లియరెన్స్ ఉండేలా చూడటం అవసరం అని చాలా మందికి తెలుసు . కానీ స్థలాన్ని బేరం ఆడేటపుడు లాయర్ దగ్గరికి వెళ్లి వచ్చేంతవరకు బేరం చేయకుండా ఉండటం చాలా సార్లు కుదరదు . బేరం ఆడటం ఒక సైకలజికల్ గేమ్ అనుకున్నాం కదా . కాబట్టి బేరం ఆడటానికి వెళ్ళడానికి ముందే ఆ లాయర్ని సంప్రదించి ఆ ప్రాంతం లో ఏ జాగ్రత్తలు తీసుకోవాలో చర్చించి వెళ్ళడం మంచిది . న్యాయ పరమయిన చిక్కులు రాకుండా అమ్మకపు డాక్యుమెంట్లలో ఏమేమి కావాలో తెలుసుకోడం మంచిది . మీరు న్యాయశాస్త్రాన్ని చదవకపోయినా , న్యాయపరంగా ఏమేమిచూడాలో తార్కికంగా ఆలోచిస్తే చాలా విషయాలు మీకే అర్ధం అవుతాయి . ఈ అవగాహన కోసం మంచి లాయర్తో స్నేహం చేస్తే ఇంకా మంచిది .
15 ఏ స్థలానికి అయినా రోడ్డు నుండి ఆ స్థలంలోకి వెళ్ళడానికి అప్రోచ్ రోడ్డు ఉందో లేదో చూసుకోవాలి .
16 సుదీర్ఘ భవిష్యత్తు లో రోడ్డు వెడల్పు కాగల స్థలం , ఫ్లై ఓవర్ రాగల స్థలం కొనేటప్పుడు రేటు ఎంత పెట్టవచ్చో చూడండి .
17 ఇళ్ళ స్థలం కొనేటప్పుడు ఆ స్థలం ముందు 10 , 15 అడుగుల రోడ్డు మాత్రమే ఉంటే , ఆ స్థలం కొనక పోవడమే మంచిది . రోడ్డుకి ఇరువైపులా డ్రయినేజికి , వాహనాలు వెళ్ళడానికి ఆ స్థలం చాలదు . అంతర్గతరోడ్డులో కనీసం 33 అడుగులు , ప్రధాన రహదారి లో 40 అడుగుల వెడల్పు ఉండాలి .
18 ఇంటి స్థలం కొనడానికి ముందు ఆ ప్రాంతంలో ఇంటి నిర్మాణానికి మున్సిపాలిటీ , పంచాయితీ అనుమతులకు కావలసిన నిబంధనలు చూడండి . అనుమతులు లభించగల స్థలానికే మార్కెట్ లో రేటు వస్తుంది .
19 వాస్తును మీరు నమ్మినా , నమ్మకపోయినా వాస్తుకు అనుకూలంగా ఉన్న ప్రదేశానికే మంచి ధర వస్తుంది . కాబట్టి మంచి దిక్సూచి చేతిలో పట్టుకుని వెళ్ళి ఆ స్థలంలో వాస్తు చూడటం మంచిది .
20 షేర్ మార్కెట్ లాగానే జనం ఎగబడి కొంటున్న ప్రదేశాలకు దూరంగా ఉండాలి . జనం దృష్టి పడని ప్రాంతాలని వెతుక్కుని 5 , 10 , 15 , 20 ఏళ్ళతర్వాత భవిష్యత్తుని ఇప్పుడే దర్శించుకుంటూ పెట్టుబడి పెట్టాలి .
21 రియల్ ఎస్టేట్ పెట్టుబడిలో ' నేను డేరింగ్ అండ్ డాషింగ్ ' అనుకోవడం చాలా సమయాల్లో మూర్ఖత్వం అని రుజువు అయింది . ఏదయినా స్థలం పెరుగుతుంది అనిపించినపుడు ఎందుకు పెరుగుతుందో సమాధానం చెప్పుకోగలిగినప్పుడు మాత్రమే మీ అంచనా సబబు అవుతుంది .
22 మోదీ ప్రభుత్వం స్మార్ట్ సిటీలను అభివృద్ది చేసినా , చేయకున్నా , జిల్లా కేంద్రాలు , రెండో తరగతి పట్టణాల వేగంగా విస్తరిస్తున్నాయి .
23 మీరొక స్థలం చూసారు . వచ్చే నాలుగయిదు సంవత్సరాలలో దాని రేటు బాగా పెరుగుతుంది అనిపించింది . దానిని ఎందుకు కొనాలి అనుకుంటున్నారో మీ జీవిత బాగస్వామికి గాని , మీ పిల్లలకి గాని వివరించండి . వాళ్ళు వినకపోతే మీ స్నేహితులకు అయినా వివరించండి . మీరు వివరిస్తున్నపుడు , మీ సలహా ఎంత వరకు సరయినదో మీరు పునరాలోచించుకుంటారు .
24 ఏ ప్రాంతంలోనయినా స్థలం ధర 1,2,3,4 లా క్రమంగా పెరుగుతూ | పోతే ధైర్యంగా పెట్టుబడి పెట్టవచ్చు . తక్కువ సమయంలో ధరల పెరుగుదల 2 , 4 , 8 , 16 లా పెరుగుతూ ఉంటే , బాగా .. ఆలోచించి అడుగువేయండి .
25 ఇల్లు , భూములను కొనేటప్పుడు అడాన్గా చెల్లించే మొత్తాన్ని నగదు రూపంలో కాకుండా చెక్కు రూపంలో చెల్లించండి . దీనివల్ల అమ్మే వ్యక్తిని అమ్మకానికి కట్టుబడేలా చేయవచ్చు .
26 రైల్వే స్టేషన్ , బస్టేషన్ , పోర్ట్ , ఏర్ పోర్ట్ సమీప ప్రదేశాలు విలువయినవి .
27 ప్రభుత్వ , ప్రవేటు ప్రాజక్టులు వచ్చే ప్రదేశాల ధరల పెరుగుతాయి .
28 విద్య , వైద్యం , ఉపాధి , ఉద్యోగ అవకాశాలున్న ప్రదేశాలకు డిమాండ్ ఉంటుంది
29 ఇల్లు , భూములనుకొనేటప్పుడు న్యాయపరంగా చూసుకోవాల్సిన అంశాలపట్ల అవగాహన , రియల్ ఎస్టేట్ ధర , వాటి హెచ్చు తగ్గుల పట్ల అంచనా సరిగా లేకుంటే- నిపుణుల సలహా తీసుకోండి , మంచి పేరున్న సంస్థలను సంప్రదించండి . ఎవరిని సంప్రదించినా- మీ వివేకాన్ని వినియోగించండి .
30 మీ దగ్గర డబ్బు ఉంది కదా అని రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్ట కండి . సరయిన ధర అని అనిపించినప్పుడు మాత్రమే భూములను కొనండి . డబ్బు రడీగా ఉంచుకొని మంచి అవకాశం కోసం ఎన్ని ఏళ్ళయినా వేచి ఉండగలవానికి రియల్ ఎస్టేట్ లో ఎన్నడూ నష్టం రాదు .
31 తక్కువ సమయంలో స్థలం విలువ అనూహ్యంగా పెరిగితే , పెరుగుదలకు కారణం సబబో కాదో విశ్లేషించుకోవాలి . గత 6 , 12 నెలల్లో ధరల పోటీ కనిపించినప్పుడు ఆ పరుగు పందెంలో పాల్గొనక పోవడం మంచిది .
32 భూములను కొనడం సులువే . అమ్మటమే- చా ... లా కష్టం . పెట్టుబడిగా కొనేటప్పుడు భూముల ధర లో డిస్కవుంట్ ఉంటేనే కొనండి . మీరు అమ్మేటప్పుడు కొనేవానికి లాభం ఉంటేనే కదా కొంటాడు . అమ్ముకొనేటప్పుడు మంచి ధర రావడం చాలా అరుదు .
33. ఈ మధ్య వచ్చిన రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అధారిటీ బిల్ 2015 ప్రకారం 500 గజాల స్థలంలో లేదా 8 కి మించి అపార్ట్మెంట్ లు కట్టినా రాష్ట్ర రియల్ ఎస్టేట్ అధారిటి అనుమతిపొందాలి . అధారిటీకి ఫిర్యాదులు చేయవచ్చు .
34 మీ అమ్మాయి మంచిది , తెలివయినది , అందమయినది అయినా ... ఆమెకి తగిన వరుడు ఆమెని చూసినప్పుడే పెళ్ళవుతుంది . మీ భూములు మంచివి అయినా ... వాటిని కొనగలిగిన హెూదా ఉన్నవాళ్ళు వచ్చినప్పుడే అమ్మగలరు . కాబట్టి , అమ్మేటప్పుడు ... వేచిచూడ గలిగే వరకు కొనండి . చాలా ఏళ్ళ క్రితం ఖమ్మంలో ఒక దిన పత్రిక ఊరి బయట పత్రిక ఆఫీసు కట్టించడం చూసి ఆ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ ధర గజం 200 రూపాయల నుండి 1500 రూపాయలకు పెంచేసారు . పత్రిక ఆఫీసు ప్రారంభం అయ్యాక ఆ ప్రాంతంలో చిన్న దకాణం కూడా ప్రారంభం కాలేదు . అది కూడా ఆ ఆఫీసు లోనే ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు . అక్కడ పత్రిక ఆఫీసు బదులు ఓ ఫాక్టరీ ప్రారంభం అయితే హెూటల్ మొదలుకొని మిగతా వ్యాపారాలు మొదలయ్యేవి . ' దున్నపోతు ఈనింది అంటే దూడను గుంజకు కట్టేయి ' అన్నట్లు పక్క వాడు స్థలం ధర పెంచగానే వీడు పెంచి , వాడు పెంచి .. చివరికి ఏ స్థలం ఎందుకు పెరుగుతుందో ఎవరికీ తెలియనంత వెర్రిగా స్థలాల రేట్లు ఒక్కోసారి పెరుగుతుంటాయి . లాజిక్ లేకుండా ధర పెరిగితే లాభాల మేజిక్ లు జరగవు అని గుర్తుంచుకోవాలి . ఇంటిస్థలం కొనడం కోసం బ్యాంకులు ఇంటి ఋణం ఇస్తాయా ? ఇస్తాయి . కానీ స్థలం కొన్న ఆరునెలల్లో ఇల్లు కట్టడం మొదలు పెట్టాలి . 18 నెలల్లో ఇంటి నిర్మాణం పూర్తి కావాలి . అలా కట్టని పక్షంలో ఆ అప్పుకు ఇంటి ఋణం వడ్డీ రేటు బదులు వాణిజ్య రుణాల వడ్డీ రేటును విధిస్తారు . బ్యాంకును బట్టి కొన్ని నిబంధనల్లో మార్పు ఉండవచ్చు .
0 Comments